నేటి విద్యార్థులు రేపటి నిరుద్యోగులు కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు

ఏమి చేయాలి?

నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడని వారు లేరు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని, విద్య వ్యవస్థను నిందించటంలో చాలా బిజీగా ఉన్నారు. అమాంతం అంతా మారిపోతే బావుండని నాకు కూడా ఉంది, కానీ ఇంత పెద్ద వ్యవస్థలో పెను మార్పులు ఆశించటం సమంజసం కాదు.

ప్రభుత్వాన్ని, విద్య వ్యవస్థను నిందించే ముందు మన వైపు నుంచి తప్పు లేకుండా చూసుకోగలిగితే ఈ సమస్యకు కొంత వరకు పరిష్కారం దొరుకుతుంది.

లక్షల మంది నిరుద్యోగులు ఉన్న తెలుగు రాష్ట్రాలలోనే, ఏ మాత్రం కష్టపడకుండా ఉద్యోగం సంపాదించగలిగే పట్టభద్రులు కూడా ఉన్నారు. ఈ వింత జీవులకు నిరుద్యోగ సమస్య అని ఒకటుందని కూడా తెలియదు. ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిస్తే చాలు, నాకు ఉద్యోగం వచ్చేసినట్టే అని ముందుగానే FIX అయ్యి వెళ్తారు. అవలీలగా ఉద్యోగం సంపాదిస్తారు. ఒక్క ఉద్యోగం దొరకక అందరూ బాధపడుతుంటే, వీళ్లకు రెండు మూడు ఉద్యోగాలు వస్తాయి. 

ఇక్కడ ఒక  విషయం గమనించాలి – వీళ్లకు పెద్ద చెప్పుకోదగ్గ మార్కులు రాలేదు, ఇంగ్లీష్ లో మాట్లాడి మాయ చేయలేదు, లంచాలు ఇవ్వలేదు, ఎలాంటి అడ్డ దారులు తొక్కలేదు.

వీళ్లకు సులభంగా ఉద్యోగాలు రావటానికి అసలు కారణం చిన్నతనం నుంచి వీళ్ళు పాఠ్యాంశాలు చదివిన విధానం. దీన్ని బాగా అర్ధం చేసుకోవటానికి ఈ చిన్న కథ చదవండి.

ఈ అమ్మాయి పేరు కావ్య, ఈ అబ్బాయి పేరు సుబ్బు

ఈ అమ్మాయి పేరు కావ్య, ఈ అబ్బాయి పేరు సుబ్బు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. ఇంచుమించుగా అన్ని విషయాల్లో ఒకేలా ఉంటారు. 

వీళ్లిద్దరికీ commonగా ఉన్న ఒక సమస్య – తోటి విద్యార్థులతో పాటు కలిసి చదవలేరు. అందరికీ గంట సేపు పట్టిన పాఠం, వీళ్ళకు రెండు గంటలు పడుతుంది.

అందుకే కావ్య, సుబ్బు ప్రతి రోజూ టీచర్ తో చివాట్లు తింటారు. “తొందరగా చదువండి, ఇంత బద్ధకం అయితే ఎలా? నిద్రమొహం వేసుకుని అలా కుర్చున్నారెంటి? ఇంకా చదవాల్సింది చాలా ఉంది. అందరూ ఎంత ఫాస్ట్ గా చదువుతున్నారో చూడండి. ఈ క్లాస్ కు పట్టిన దరిద్రం మీ ఇద్దరూ”

ఇలాంటి మాటలతో వాళ్ళని ప్రతి రోజూ మానసికంగా కృంగిపోయేలా చేసేవాళ్ళు ఆ స్కూల్ టీచర్స్. అందరితో పాటు నేను కూడా వేగంగా చదవాలి అనే వత్తిడి వల్ల ఏ ఒక్క టాపిక్ వీళ్ళిద్దరూ పూర్తిగా చదివేవారు కాదు. సగం సగం చదవటం అలవాటు చేసుకున్నారు.ఇది పరిస్థితి!

కావ్య ఇంట్లో పరిస్థితి చూద్దాం

దురదృష్ట వశాత్తు కావ్య వాళ్ళ అమ్మ బాగా చదువుకుంది. విపరీతమైన పోటీ మనస్తత్వం.

కనీసం ఇంట్లో అయినా మొదలు పెట్టిన టాపిక్ పూర్తిగా చదవాలని కావ్య అనుకునేది. వాళ్ళ అమ్మ తనకు ఆ అవకాశం ఇచ్చేది కాదు. టీచర్ కంటే కఠినంగా మాట్లాడి మరింత వత్తిడికి గురిచేసేది. దీనివల్ల పూర్తిగా చదవకుండా పేజీలు తిప్పేయటం కావ్యకు అలవాటుగా మారింది.

ఇలాగే సగం సగం చదువుతూ 50 శాతం ఉతీర్ణతతో డిగ్రీ పూర్తి చేసింది.

ఇప్పుడు సుబ్బు ఇంట్లో పరిస్థితి చూద్దాం

సుబ్బు వాళ్ళ అమ్మ పెద్దగా చదువుకోలేదు, కాబట్టి కేవలం Common senseతో తనకు తోచిన సాయం చేయాలనీ ప్రయత్నించేది. సుబ్బుకు చదువు విషయంలో ఎదురయ్యే సమస్యలు జాగ్రత్తగా వినేది (పిల్లలు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినటం చాలా ముఖ్యం) తోచిన సలహా ఇచ్చేది.

అదే క్రమంలో స్కూల్లో జరిగిన విషయం అమ్మతో చెప్పాడు. 

“అందరిలా నేను వేగంగా చదవలేకపోతున్నాను. టీచర్ తిడుతున్నారు. కొడతామని వార్నింగ్ ఇచ్చి భయపెడుతున్నారు. ఏమి చేయమంటావ్ అమ్మ?” అని అడిగాడు

అప్పుడు సుబ్బు అమ్మ చెప్పిన మాటలివి

“తోటి విద్యార్థులు ఎంత వేగంగా చదువుతున్నారన్న విషయం ప్రస్తుతానికి పట్టించుకోవద్దు. నీకు నచ్చినంత సమయం తీసుకో. కానీ మొదలు పెట్టిన ప్రతి ఒక్క టాపిక్ పూర్తిగా చదువు. వేరే వాళ్లకు గంట పట్టిన టాపిక్, నీకు రెండు గంటలు పట్టవచ్చు. ఇదేమీ తప్పు కాదు. కావాలంటే నేను వచ్చి మీ టీచర్ తో మాట్లాడతాను. పుస్తకంలో ఉన్న 10 పాఠాలు సగం సగం చదవటం కంటే ఏవైనా 5 పాఠాలు తీసుకుని వాటిని పూర్తిగా చదువు”

ఈ మాటలు విన్న సుబ్బు చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాడు. అమ్మ చెప్పినట్టే చదివాడు, ఇదే అలవాటుగా చేసుకున్నాడు. సుబ్బుకు కూడా కావ్య లాగే 50% ఉతీర్ణతతో పాస్ అయ్యాడు.

మార్కుల రీత్యా చూస్తే ఇద్దరూ సమానమే. కావ్య సగం సగం చదివి 50% మార్కులు తెచ్చుకుంటే, సుబ్బు మాత్రం చదివిన కొన్ని టాపిక్స్ పూర్తిగా చదివాడు. సుబ్బు దగ్గర సబ్జెక్టు బలంగా ఉంది, కావ్య దగ్గర సబ్జెక్టు  చాలా బలహీనంగా ఉంది. 

కావ్యకు ఎన్ని ఇంటర్వూస్ కు వెళ్లినా ఎక్కడా సెలెక్ట్ అవ్వలేదు. సుబ్బు మాత్రం వెళ్లిన ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో బాగా performance ఇస్తూ వచ్చాడు. తనకు వచ్చిన మార్కులు కేవలం 50% అని interviewers మర్చిపోయేలా చేశాడు. నేర్చుకునే ప్రతి టాపిక్ పూర్తిగా, పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అద్భుతాలు మీ పిల్లలు కూడా సుబ్బు లాగా తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగం సంపాదిస్తారు. 

నేను పైన చెప్పిన 50 మార్కులు ఏ తల్లితండ్రులకు రుచించవని నాకు తెలుసు. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే అని గమనించగలరు. రాబోయే రోజుల్లో నేను ఈ విషయం గురించి మరింత సమాచారం మీకు ఆర్టికల్స్, వీడియోస్ రూపంలో పంపించబోతున్నాను. అవన్నీ చక్కగా మీరు పాటించగలిగితే మీ పిల్లలకు మీరు అనుకున్న మంచి మార్కులతో పాటు, సబ్జెక్టు మీద చక్కని పట్టు వస్తుంది.