బిజినెస్ కోసం ఇమెయిల్ లేదా కొరియర్ చేయాల్సిన విధానం

పరిచయం లేని వ్యక్తులకు ఈ – మెయిల్స్, కొరియర్ పంపటం గురించి నా వీడియోస్ లో ఇప్పటికే చాలా సార్లు ప్రస్తావించాను. కొరియర్ పంపేటప్పుడు నేను చెప్పినట్టు చేస్తే మీ ప్యాకెట్ అవతలి వారి దృష్టిలో పడే అవకాశం ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం గమనించాలి – అవతలి వ్యక్తి ఫేమస్ పర్సనాలిటీ అయితే… ప్రతి రోజూ ఎన్నో ఈ – మెయిల్స్ వస్తాయి.

మీరు వారికి ఓ సందేశం పంపి, వారి నుంచి బదులు (reply ) రాకపోతే వారిమీద అలగటం, కోపం తెచ్చుకోవటం లాంటి పిల్ల చేష్టలు చేయొద్దు. ఓపిక ఉండాలి. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి, లేదా లైట్ తీసుకోవాలి. మొదట్లో నేను పంపిన messages, కొరియర్ చేసిన పాకెట్స్ కు అస్సలు రెస్పాన్స్ వచ్చేది కాదు. అందుకని వాళ్లకు “బుల్లి లంచం” ఇవ్వటం మొదలు పెట్టాను.

నా సందేశంతో పాటు ఓ చాక్లెట్, లేదా లోకల్ గా దొరికే మిఠాయి జోడించి పంపటం మొదలు పెట్టాను. ఉదాహరణకు వేటపాలెం జీడిపప్పు చిక్కీ. అమెరికాలో ఉన్న ఓ కంపెనీకు నేను నా బిజినెస్ ప్లాన్ పంపినప్పుడు ఇదే పని చేశాను. వారితో ఫోన్ కాల్ లో కూర్చున్నపుడు వారు మొదట అడిగిన ప్రశ్న “ఈ పదార్థం పేరు ఏమిటి? ఎక్కడ దొరుకుతుంది?” అది సంగతి! ఎంత పోటుగాడైనా నాలుక విషయంలో tempt అవుతాడు! దాన్ని వాడేయండి.

రెండో లంచం! మీ ఉత్తరం/మీ రీసెర్చ్ పేపర్ ఒక పేపర్ కాపీతో పాటు, ఓ చిన్న pendrive లో hard code చేసి పంపండి.(డిలీట్ చేయటానికి వీలు లేకుండా సెట్ చేయండి) మీ సందేశం నచ్చినా, నచ్చకపోయినా మీరు పంపిన pendrive నచ్చుతుంది. దాన్ని గ్యారంటీగా వాడతారు, అందులో మీ సందేశం permanent గా ఉండిపోతుంది. ఈ రోజు కాకపోయినా రేపైనా మీతో పని పడితే మీ వివరాలు అందులో ఉంటాయి.

అన్నిటికంటే ముఖ్యంగా మీ సందేశం/రీసెర్చ్ పేపర్ లో కంటెంట్ బాగుండాలి. ఓపెనింగ్ అద్భుతంగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ బుల్లి లంచం వారి దృష్టి మన వైపు మరల్చుకోవటానికి ఒక చిన్న ట్రిక్ మాత్రమే. వంద ట్రిక్స్, గిమ్మిక్స్ వాడినా మీ కంటెంట్ లో విషయం లేకపోతే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.