వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు ఈ నోట్స్ పూర్తిగా చదవండి.

వ్యాపారం ఎందుకు మొదలు పెడుతున్నారు అని అడిగితే, ఎక్కువ శాతం ఈ 5 కారణాలు చెప్తారు. 

  1. ఒకరి కింద పని చేయటం ఇష్టం లేదు, సొంతగా ఏదైనా చేయాలని ఉంది.
  2. నా Talent ను ఉపయోగించుకుని నా బాస్ లక్షలు, కోట్లు సంపాదించుకుంటున్నాడు, అదేదో నేనే వ్యాపారం పెడితే ఆ డబ్బు నేనే సంపాదించవచ్చు కదా.
  3. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదు. బ్రతకడానికి డబ్బు కావాలి. బ్రతుకు తెరువు కోసం వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను.
  4. బిల్ గేట్స్ లాంటి గొప్పవాళ్లను చూసి inspire అయ్యాను, కోట్లు సంపాదించాలని ఉంది, మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. 
  5. చదువు అబ్బలేదు, ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. 

ఒకరి కింద పని చేయటం ఇష్టం లేదు, వత్తిడి తట్టుకోలేకపోతున్నాను. 

సొంతగా ఏదైనా చేయాలనుకుంటున్నాను.

వ్యాపారం మొదలు పెట్టిన తరువాత ఒకరు కాదు వంద మంది క్రింద పనిచేయాలి. రూపాయి పెట్టి ఒక వస్తువు కొన్న ప్రతీ ఒక్కరూ  మీ బాస్ లాగే ప్రవర్తిస్తారు. 

ఉద్యోగి బాస్ దగ్గర మాత్రమే తిట్లు తింటాడు. వ్యాపారం మొదలు పెట్టిన తరువాత సరిగ్గా సర్వీస్ సరిగ్గా చేయకపోయినా, కొద్దిగా విసుగు ప్రదర్శించినా, ఆ కస్టమర్ మీ గురించి వందల మందికి దుష్ప్రచారం చేస్తాడు. అతను తిట్టడం మాత్రమే కాకుండా వందల మంది చేత తిట్టిస్తాడు. 

ఒకరి క్రింద పనిచేయటం ఇష్టం లేదు కాబట్టి వ్యాపారం అనే ఆలోచన తప్పు. మన తల పైన ఎప్పుడూ ఒకడుంటాడు. ఇది ఫిక్స్ అయిపోండి. 

మీకు మంచి బాస్ దొరికే వరకు ప్రయత్నం చేయండి. మంచి బాస్ మిమ్మల్ని ఫ్రీ గా వదిలేస్తాడు, కట్టడి చేయడు. అన్నీ కాకపోయినా  మీకు కొన్ని విషయాల్లో స్వతంత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. కొన్ని స్టార్తప్ కంపెనీలలో తక్కువ జీతాలు ఇస్తారు, కానీ మంచి freedom ఉంటుంది. మీరు కోరుకుంటున్న ప్రశాంతత దొరుకుతుంది. వత్తిడిలేని జీవితం కోసం అయితే వ్యాపారం మొదలుపెట్టకండి.

నా Talent ను ఉపయోగించుకుని నా Boss కోట్లు సంపాదించుకుంటున్నాడు. అదేదో నేనే వ్యాపారం పెడితే ఆ డబ్బు నేనే సంపాదించవచ్చు కదా.

నాకు 15 వేలు ఇచ్చి, నా బాస్ నా మీద లక్షన్నర సంపాదిస్తున్నాడు. ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు నేను కూడా ఇలానే అనుకునేవాడిని. ఇప్పుడు ఈ మాట వింటే నాకు నవ్వొస్తుంది. మీతో పాటు మీ ఆఫిసులో ఓ 30 ఉన్నారు అనుకోండి. (మీ ఆఫిసు సెక్యూరిటీ గార్డు, ముందు గదిలో అందరినీ నవ్వుతూ పలకరించే receptionist అమ్మాయి తో సహా) – అందరూ కలిసి ఒక టార్గెట్ పూర్తి చేయాలని అనుకుంటారు కాబట్టే ఇది సాధ్యం అవుతుంది. 

ఒక్కరుగా ఉంటే 10,000 సంపాదిస్తారు, పది మంది టీమ్ తో కలిస్తే మీ output / productivity నాలుగింతలు అవుతుంది. అలాగని మీ potential నెలకు 40,000 అని భ్రమ పడకూడదు. అందరితో కలిసి పనిచేసినప్పుడు మాత్రమే మీ potential 40,000. సింగల్ గా వస్తే మీ potential 10,000 మాత్రమే.

మీకు కనిపించకపోయినా మీ ఆఫిసులో ఏ పని చేయకుండా ఎప్పుడూ ఫోన్లో బాయ్ ఫ్రెండుతో మాట్లాడుకుంటూ ఉండే ఆ ముందు గది receptionist అమ్మాయి కూడా ఎదో ఒక పని చేస్తుంది. సెక్యూరిటీ గార్డు అందరి మీద ఓ కన్నేసిఉంచుతాడు, ఆఫీస్ బాయ్ ఛాయ్ తీసుకొచ్చి 4.30 కు మీ ముందు ఉంచుతాడు. మీ టీమ్ లీడ్ & ప్రాజెక్ట్ మేనేజర్ లాంటి వాళ్ళగురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రేపు వ్యాపారం పెట్టిన తరువాత 10 మంది చేసే పనిని మీరు చేయగలిగితే అప్పుడు మీకు 40,000 వస్తాయి.

చేయగలరా? కంప్యూటర్ మీద చేతులు ఆడించటం మాత్రమే కాకుండా వ్యాపారంలో అన్నీ మీరే చేయాలి – మార్కెటింగ్, client కమ్యూనికేషన్, selling, after sales support, సోషల్ మీడియా management.

మిమ్మల్ని భయపెట్టాలని కాదు, facts చెప్తున్నా!

ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావట్లేదు. బ్రతకడానికి డబ్బు కావాలి, బ్రతుకు తెరువు కోసం వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను.

ఇది మంచి కారణమే! దీని మీద నాకు ఎలాంటి complaints లేవు. అయితే బ్రతుకు తెరువు కోసం వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు, కొన్ని తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలి [నేను వ్యాపారం మీద వ్రాసిన అన్ని ఆర్టికల్స్ మరియు వీడియోస్ చూస్తే సరిపోతుంది] ఆర్థిక పరిస్థితి బాగోని వారు, అర్జెంటుగా డబ్బు కావాలనుకునేవారు కొంచం అలోచించి నిర్ణయం తీసుకోండి. 

బిల్ గేట్స్ లాంటి గొప్పవాళ్లను చూసి inspire అయ్యాను, కోట్లు సంపాదించాలని ఉంది, మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. 

ఈ కోరిక ముఖ్యంగా యంగ్ జనరేషన్ లో ఎక్కువగా ఉంది. గొప్పస్థాయికి ఎదగాలన్నకోరిక మంచిదే. మరీ ఎక్కువ పెట్టుబడితో కాకుండా, చిన్నపెట్టుబడితో మొదలుపెట్టండి. అయితే కనీసం 6 నెలల ఉద్యోగ అనుభవం (ఎంత చిన్నఆఫిసు అయినా సరే) ఉంటె మంచిది. జాబ్ రావట్లేదు సామి అంటారా? అయితే కనీసం ఓ సీనియర్ వ్యాపారస్తుడి దగ్గర ఉచితంగా పనిచేస్తాం అని internship సంపాదించండి. ఇదీ కుదరకపోతే ఓ పెద్దాయనని సలహాదారుడిగా పెట్టుకోండి. అన్నీ కాకపోయినా అనుభవజ్ఞులకు కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. [జుట్టు నెరిసిన ప్రతీఒక్కరూ అనుభవజ్ఞులు అవ్వరు, కొంత మంది వయసుతో పాటు అనుభవం రాకపోగా మూర్కత్వం వస్తుంది, అలంటి వాళ్ళని సలహాదారుడిగా నియమించకపోవటమే మంచిది.] 

చదువు అబ్బలేదు, ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. 

కొంతమంది సరిగ్గా చదువులో రాణించలేని వారు వ్యాపారంలో బాగా రాణిస్తారు. వీళ్ళకి తెలివితేటలు, కష్టపడే తత్త్వం ఉంటుంది కానీ చదువంటే మాత్రం ఆసక్తి ఉండదు. 

వాళ్లకు పుస్తకాలలో పాఠాల కంటే, రియల్ లైఫ్ లో experimentation చేసి నేర్చుకోవటం, అనుభవపూర్వకంగా అన్నీ అధ్యయనం చేయటం అంటే చాలా ఇష్టం. అలంటి వారు నిక్షేపంగా వ్యాపారం మొదలుపెట్టండి. 

అయితే చదువు అబ్బని రెండవ రకం వాళ్ళు ఉన్నారు.వీళ్ళకు చదువు challenging గా ఉంటుంది. కష్టం వాళ్లకు నచ్చదు, వ్యాపారం చూస్తానికి చాలా సులభంగా ఉంటుంది కాబట్టి, వ్యాపారం పెట్టాలనుకుంటారు. కష్టం ఇష్టం లేని వారు, చెంచలంగా ఉండేవారు వ్యాపారం ఎప్పుడూ పెట్టకూడదు. మీకు చదువు ఎందుకు రాలేదో ఒక సారి చెక్ చేసుకోండి. మీరు రెండవ కోవకు చెందిన వారైతే వ్యాపారం పెట్టవద్దు. 


బిజినెస్ మొదలు పెట్టడానికి మెరుపు ఐడియాలు అవసరమా?

“ఓ కాలేజీ కుర్రాడికి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనకు సృజనాత్మకత జోడించాడు. ఎవ్వరూ ఆ కుర్రాడిని సపోర్ట్ చేయలేదు. తన ఆలోచనను నమ్మి ఒంటరిగా ముందు సాగాడు(బబుల్ గమ్ లాగా అన్నమాట) ఇప్పుడు ఆ బిజినెస్ కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తుంది”

ఇట్లాంటి ఆర్టికల్స్, టీవీ ప్రోగ్రామ్స్ మీరు ఇప్పటివరకు చాలానే చూసి ఉంటారు. ఇవి చుసిన అందరూ వ్యాపారం మొదలు పెట్టాలంటే మెరుపులాంటి ఐడియాలు, తురుము లాంటి ఆటిట్యూడ్ ఉండాలని నమ్మటం మొదలు పెట్టారు.

ఇలాంటి ఆర్టికల్స్ మరియు టీవీ ప్రోగ్రామ్స్ చేసే వారికి వ్యాపార అనుభవం ఉండదు. సెన్సషనల్ గా ఏదో రాయాలని రాసి, మమ అనిపిస్తారు తప్ప ఈ ఆర్టికల్స్ లో వాస్తవం చాలా తక్కువ. మీరు గమనిస్తే ఇంచుమించుగా అన్ని వ్యాపారాల గురించి వీళ్ళు ఇలాగే వ్రాస్తారు.

నిజానికి వ్యాపారం మొదలు పెట్టడానికి మెరుపులు, ఉరుములతో పనిలేదు. ఇప్పటివరకు ఎవ్వరూ స్టార్ట్ చేయని బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకోవద్దు, అవసరం లేదు.

ఆల్రెడీ ఉన్న ఐడియాలను కొద్దిగా ముందుకు తీసుకెళ్తే  చాలు. దీని గురించి నేను వివరంగా సొంత వ్యాపారం మొదటి భాగం అనే వీడియోలో చెప్పాను.

వ్యాపారంలో డబ్బు పెట్టే ముందు ఒక చిన్న పరీక్షా చేయాలి. 

ఎగురుతుందా, క్రింద పడిపోతుందా?

లేడికి లేచిందే పరుగు అన్నట్టు పరుగులు తీయకండి.వ్యాపారం పెట్టాలన్న ఆత్రుతతో కొంత మంది ముందు వెనుక ఆలోచించకుండా ఎక్కువగా డబ్బు తెచ్చి కుమ్మరిస్తారు, వ్యాపారం సక్సెస్ అవుతుంది అని ఎలాంటి గ్యారంటీ లేదు.

ఉదాహరణకు మీరు ఒక కోచింగ్ సెంటర్ మొదలు పెట్టాలి అనుకున్నారు అనుకోండి. ఓ మంచి సెంటర్ లో షాపు అద్దెకు గానీ లీజుకు కానీ తీసుకోకుండా పబ్లిసిటీ చేయండి. 

ఒక డమ్మి ప్యాంప్లెట్ పంచిపెట్టండి. మీ కోచింగ్ సెంటర్ గురించి వివరంగా వ్రాసి చివరిలో అడ్రస్ ఇవ్వకుండా మరిన్నివివరాలకు వాట్సాప్ నెంబర్ ను సంప్రదించండి అని చెప్పి ఒక నెంబర్ ఇవ్వండి. మీ కోచింగ్ సెంటర్ మీద ఆసక్తితో ఎంత మంది ఫోన్ చేస్తారో చూడండి. అంటే షాపుకు అడ్వాన్సులు, ఫర్నిచర్ కొనకుండా, లేని వ్యాపారానికి పబ్లిసిటీ అన్న మాట. వీలైతే న్యూస్ పేపర్ లో చిన్న యాడ్ ఇవ్వండి. 

మహా అయితే న్యూస్ పేపర్ యాడ్ మరియు pamplets మీద 5 వేలు ఖర్చు అవుతుంది. కానీ మీ ఐడియా కు రెస్పాన్స్ ఎలా ఉంది అన్న విషయం తెలుస్తుంది. 

ఫోన్ చేసిన వారు అడిగితే, త్వరలో ప్రారంభించబోతున్నాము, ఫర్నిచర్ పని జరుగుతుంది అని చెప్పి కాల్ ముగుంచండి. వాళ్ళ నెంబర్ జాగ్రత్తగా సేవ్ చేసుకోండి. (ఇలా ప్రతి నెంబర్ సేవ్ చేసుకోండి) ఇప్పుడు మీ దగ్గర ఒక డేటా బేస్ తయారు అవుతుంది. 

అసలు ఎవరూ ఆసక్తి చూపించకుండా వ్యాపారం పెట్టడానికి, 100 మంది ఆసక్తి చూపాక వ్యాపారం పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. 

మీకు బాగా మాట్లాడటం తెలిస్తే ఆ ఫోన్ చేసిన వ్యక్తికి హోమ్ ట్యూషన్ / ఆన్లైన్ క్లాస్ అని చెప్పి convince చేయవచ్చు, అతన్ని మీ స్టూడెంట్ గా మార్చటానికి అవసరం అయితే ఒక డెమో క్లాస్ ఇవ్వచ్చు. 

కొన్ని వ్యాపారాలలో షాపుతో పని లేకుండా మంచి ధరకు మనం వస్తువులు సప్లై చేస్తామంటే నిక్షేపంగా ఆర్డర్లు వస్తాయి. అలా ఫోన్ చేసిన వారి నుంచి ఆర్డర్ తీసుకోవచ్చు. 

ఇలా షాపులేకుండా కేవలం ఒక pamphlet సహాయంతో మీ వ్యాపారం కిక్ స్టార్ట్ చేయండి.

ఒకవేళ మీ pamphlet లేదా న్యూస్ పేపర్ యాడ్ కు ఎటువంటి response రాలేదు అనుకోండి, ఒక్కసారి మీ వ్యాపారం ఐడియా అసలు వర్క్ అవుట్ అవుతుందా లేదా అని డబల్ చెక్ చేసుకోండి.

అందరికీ ఒకే రకమైన పబ్లిసిటీ వద్దు

మీ వ్యాపారం గురించి ప్రచారం చేసేటపుడు ఏదో ఒక చిన్న పోస్టర్, బ్యానర్, pamplet వేయించి చేతులు దులుపుకో వద్దు. కొంతమంది కస్టమర్లు తక్కువ ధరలకు ఆకర్షితులు అయితే, కొందరు నాణ్యతకు ఆకర్షితులు అవుతారు, మరి కొందరు మీరు అందించే కస్టమర్ కేర్ కు, మీ నిజాయితీకి ఆకర్షితులు అవుతారు.

మన గుండు బాస్(లలిత జ్యువలారీ) గారి యాడ్ గుర్తుందిగా? అందరూ నవ్వారు కానీ ఆ యాడ్ సూపర్ హిట్ అయ్యింది. లలితా బ్రాండ్ ను అతి తక్కువ సమయంలో పెద్ద పెద్ద బ్రాండ్స్ సరసన చేర్చింది. ఆయన అందరిలా సినిమా తారల అందమైన ముఖాలను చూపించి పబ్లిసిటీ ఇవ్వలేదు. ఆయన నున్నని గుండు + నిజాయితీతో కూడిన ఒక ప్రపోసల్. అంతే మనందరినీ కట్టిపడేశాడు. గోల్డ్ కాయిన్ అని డిస్కౌంట్ ఆఫర్ అని ఎలాంటి పాత చింతకాయ పచ్చడి ప్రామిస్సులు ఆయన చేయలేదు. వచ్చాడు, గెలిచాడు! సింపుల్!

మనం కూడా కేవలమ్ డిస్కౌంట్, స్పెషల్ ఆఫర్ తక్కువ ధర లాంటి రొటీన్ ఆఫర్లతో పాటు కొన్ని కొత్త కొత్త ఆఫర్లు ప్రమోషన్లు చేయాలి. 6 నెలల సమయంలో ప్రతీ నెల ఒక్కో రకం ఆఫర్ తో కస్టమర్స్ ను ఆకట్టుకోవాలి. కస్టమర్ ఎక్కువగా దేనికి ఆకర్షితులు అవుతున్నారో ఈ చిన్న ప్రయోగం మీకు చెప్తుంది.

ఉదాహరణకు, మీదొక బట్టల దుకాణం అనుకోండి – ఇప్పటి వరకు మన ఊరిలో ఎక్కడా లేని 50 కొత్త డిజైనర్ చీరలు, డ్రెస్సులు అని చెప్పండి. అమ్మాయిలకు unique గా కనపడాలి, ఎవరూ కట్టని చీర / డ్రెస్ తో కొత్తగా కనిపించాలని ఉంటుంది. దానికి తగ్గట్టుగా పబ్లిసిటీ ఇవ్వండి. 

మీరు వ్యాపారం ఇంకా మొదలు పెట్టకపోయినా పర్లేదు. నేను చెప్పిన ఈ చిన్న టాస్క్ చేసి చుడండి. 

ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకుని దానికి 5 విధాలుగా సెపెరేట్ pamplet వ్రాసే ప్రయత్నం చేయండి. 

ఉదాహరణ – సోప్, సాంబార్ పొడి, పెన్, జీన్స్ పాంట్, మొబైల్ ఫోన్. ఒక్కో ప్రోడక్ట్ ను 6 రకాలుగా ఎలా ప్రమోట్ చేస్తారు మీరు? అవును! ఇది చాలా challenging టాస్క్ అని నాకు తెలుసు. అందుకే చేయమంటున్నా!

వీలైతే దీనిగురించి త్వరలో ఒక వీడియో చేస్తాను.

మంచి ప్యాకేజింగ్ = ఎక్కువ ధర

మొన్నామధ్య రోడ్డు ప్రక్కన ఉన్న ఒక చిన్న బంకులో(చాలా చిన్న కొట్టు) ఒక మాస్కు 

కొనటానికి వెళ్ళాను. ధర 50 రూపాయలు – మంచి క్వాలిటీ. అదే మాస్కు అదే దుకాణంలో అట్టపెట్టిలో పెట్టి బ్రాండెడ్ స్టికర్ వేసి 150 రూపాయలకు అమ్ముతున్నారు. రెండిటికీ తేడా ఏంటని షాపులోవ్యక్తిని అడిగితే క్వాలిటీ అని చెప్పాడు. ఆ రెండు మాస్కులను పక్క పక్కన పెడితే ఆ షాపులో వ్యక్తి కూడా confuse అయ్యాడు. నిజానికి రెండూ ఒకటే క్వాలిటీ. కేవలం ఒక దాని ప్యాకేజింగ్ లో తేడా అంతే! 

ఇదే తంతు నేను అమెజాన్.లో కూడా చూశాను. ఒకటే పుస్తకం కేవలం ఆ పుస్తకం ముందు అట్ట డిజైన్ మార్పు చేసి 200, 600, 1200 ఇలా వేరు వేరు ధరలకు అమ్ముతున్నారు.

రంగుల అట్టపెట్టెలో పెట్టగానే ఆ వస్తువు విలువ పెరిగిపోతుంది. అదే దానికి ఒక మంచి పేరు పెట్టిచుడండి, అది రేపో మాపో పెద్ద బ్రాండు అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు.

మీకు తెలుసా, మనందరం ఎంతో ఇష్టపడే ఐఫోన్ తో పాటు అదే ఫ్యాక్టరీలో, అదే క్వాలిటీతో తయారైన వేరే చైనా ఫోన్ కేవలం 12 వేలకు దొరుకుతాయని. తేడా ఆ ఐఫోన్ బాక్స్!

అట్టపెట్టిలో ఇంత ఉన్నదన్న మాట. చిన్న చిన్న దుకాణదారులు ఖర్చు అనుకోకుండా ఒక అట్ట పెట్టె, లేకపోతే ఓ జ్యుటు సంచి, లేదా ఒక ప్యాకేజింగ్ కవర్ తయారు చేయించండి. మీరు కూడా ఒక పెద్ద బ్రాండ్ లాగా మారిపోతారు. ఈ చిన్న మార్పు మీ కస్టమర్స్ కు ప్రీమియం ఫీల్ ఇస్తుంది.

ఈ డాక్యుమెంట్ తరచుగా update చేస్తాను. ఈ లింక్ సేవ్ చేసి పెట్టుకోండి.