మంచివాళ్ళు తగ్గిపోయారు

ఈ కాలంలో మంచి ఎక్కడ ఉంది సామీ. అంతా స్వార్ధమే! పక్కనవాళ్ల గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ మాటలు మనం తరచూ వింటుంటాము.

చిన్నపిల్లలు ఏదైనా మంచి పని చేస్తే మనం వాళ్ళకి చాక్లెట్ కొనిస్తాము, ఏదైనా తప్పు చేస్తే తొడపాసెం పెట్టి శిక్షిస్తాము. ఇలా చేయటం వలన వాళ్ళు మంచి ఎక్కువగా చేసే ప్రయత్నం చేస్తారు, చెడు చేయటానికి భయపడతారు.

మొన్నామధ్య ఒక హాస్య నటికి ఆరోగ్యం బాగోకపోతే, చిరంజీవి గారు వాళ్ళ పాప శ్రీజకు 2 లక్షల రూపాయల చెక్కు ఇచ్చి పంపారు, ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆ ఫోటో క్రింద ఓ ప్రబుద్దుడు పెట్టిన కామెంట్ – చిరంజీవి దగ్గర బోలెడు డబ్బు ఉంది, రెండు లక్షలు ఇవ్వటం ఏంటి? ఇంకా ఇస్తే అరిగిపోతాడా? పది లక్షలు ఇవ్వచ్చుగా? ఇది చిరంజీవి గారు చేసిన మంచిపనికి ఆ ప్రబుద్దుడు పెట్టిన తొడపాసెం.

కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న మధ్య తరగతి కుటుంబాల కోసం మా విజ్జుగాడు (విజయ్ దేవరకొండ) ఓ foundation మొదలు పెట్టి, బోలెడంత మందికి సాయం చేస్తే ఒక వెబ్సైటు నడిపే పెద్దాయన నోటికొచ్చినట్టు పిచ్చిరాతలు వ్రాశాడు. ఇది విజ్జుగాడికి పెద్దాయన పెట్టిన తొడపాసెం.

బిల్ గేట్స్ నానా కష్టాలు పడి, మేధావులను సంప్రదించి ప్రపంచంలో ఎన్నోఆరోగ్య సమస్యలకు వేల కోట్లు ఖర్చుపెట్టి పరిష్కారాలు వెతుకుతుంటే, ఏవో పిచ్చ conspiracy theories, fake వీడియోస్ చూసి ఆయాన్ని ఆడిపోసుకున్నారు. ఇది బిల్ గేట్స్ కు అమెరికా పెట్టిన తొడపాసెం.

మంచి చేసిన ప్రతి సారీ చాక్లెట్ ఇవ్వకపోగా తొడపాసెం పెట్టి మంచోడి మనసు గాయపరుస్తూ ఉంటాము. కాదు కాదు, డబ్బున్నోడి మనసు గాయపరుస్తూ ఉంటాము. ఎందుకంటే అందరికీ వాళ్ళని చూసి కుళ్ళు.

మొన్నామధ్య మహేష్ బాబు వాళ్ళ బిడ్డ గౌతమ్ తో కలిసి సరదాగా ఆడుకుంటున్న ఒక వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. ఆ వీడియోలో ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటున్నారు. అది చూసి ఒకడు “తెలుగు సినిమాలు చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు, తెలుగులో మాట్లాడాటానికి ఏంటి నొప్పి” అని కింద కామెంట్

అసలు విషయం ఏంటంటే, మహేష్ బాబు ఆయన బిడ్డ గౌతమ్ ఒక ఖరీదైన gymలో ఉన్నారు(ఇంటిలోనే ఏర్పాటు చేసుకున్న జిమ్) అది చూసి ఏడుపు, మహేష్ బాబుని ఎలా తిట్టాలో తెలియదు పాపం. ఎలాంటి controversy లేని ఒక boring స్టార్ హీరో. అందుకని తెలుగు భాషలో మాట్లాడటం లేదు అని ఒక దిక్కుమాలిన కామెంట్. మహేష్ బాబు ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడని వీళ్ళకి చెప్పినా, అతని వద్ద బోలెడు డబ్బుంది ఒకటి కాదు పది గ్రామాలు దత్తత తీసుకోవచ్చు. సినిమాకి 20 కోట్లు తీసుకుంటాడుగా అన్ని డబ్బులు ఏమిచేస్తాడు?

మనం ఇంత చేసినా, వీళ్ళు బిడ్డల్ని క్షమించట్టు అందరినీ క్షమించి మంచి చేస్తూనే ఉన్నారు. వీళ్ళందరికీ విసోగొచ్చి ఎందుకొచ్చిన మంచి పనులు అని అనుకునే వరకు మనం ఇలాగే ఉందామా?

ఏసీ గదుల్లో డబ్బున్నోడు కూల్ గా ఉంటాడు కాబట్టి, మన పిచ్చి మాటల్ని క్షమించేస్తాడు, అదే ఉండీ లేక అతి కష్టం మీద సాయం చేసిన మధ్య తరగతి వాడికి ఒక్క సారి తొడపాసెం పెడితే చాలు, జీవితంలో ఇంకో సారి మంచి పని చేయకూడదు అని నిర్ణయం తీసుకుంటాడు. ఆలా నిర్ణయించుకున్నవాళ్ళు మన మధ్యలో ఎంతో మంది ఉన్నారు.

కాబట్టి చాక్లెట్ ఇవ్వకపోయినా పర్లేదు , దయచేసి తొడపాసెం పెట్టకండి ప్లీజ్!

అవినాష్ కుమార్ (మహామేధావి ఛానల్)